భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు (Srirama Navami 2025)
దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలం శ్రీరామనవమి వేడుకల కోసం సిద్ధమైంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా గొప్పగా జరగనున్నాయి. సీతారాముల కల్యాణం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాదాయ శాఖతో పాటు స్థానిక అధికారులు భారీగా ప్లాన్ చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నీ సరిచూశారు.
అందంగా ముస్తాబైన భద్రాద్రి
భద్రాద్రి రాముడి కల్యాణం కోసం పట్టణం అందంగా ముస్తాబైంది. రామాలయం, మిథిలా స్టేడియం చుట్టూ చలువ పందిళ్లు, అందమైన గుడ్డలతో అలంకరించారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ భక్తుల కోసం మిథిలా స్టేడియంలో పొగమంచు సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో భక్తులకు ఎండ నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. ఆలయం చుట్టూ లైట్లతో అందంగా మెరుస్తోంది.
కార్యక్రమాలు, భక్తుల కోసం ఏర్పాట్లు
శనివారం ఎదుర్కోళ్లు, ఆదివారం సీతారాముల కల్యాణం, 7వ తేదీన పట్టాభిషేకం జరుగుతాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు రాముడికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారు. లక్షల్లో భక్తులు రావచ్చని పోలీసులు భారీ బందోబస్తు చేస్తున్నారు. మిథిలా స్టేడియంలో కల్యాణం కోసం అన్ని సిద్ధం చేశారు.
లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లు, భక్తులకు మజ్జిగ, నీళ్లు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 19 పరసాద కౌంటర్లు, 80 తలంబ్రాల పంపిణీ కేంద్రాలు రెడీ చేశారు. నవమి తర్వాత ముత్యాల తలంబ్రాలను కార్గో, పోస్ట్, ఆన్‌లైన్ ద్వారా పంపుతామని ఈఓ రమాదేవి చెప్పారు.
Also Read: వొంటిమిట్ట రామాలయంలో హనుమంతుడు ఎందుకు లేడు
వేములవాడలో రాజన్న ఆలయంలోనూ వేడుకలు
వేములవాడ రాజన్న క్షేత్రంలో కూడా శ్రీరామనవమి గొప్పగా జరుగుతుంది. దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. ఉగాది నుంచి శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం సీతారాములకు ప్రత్యేక పూజలు, 11:55కి కల్యాణ వేదిక వద్ద కల్యాణం జరుగుతుంది. భక్తులకు నీళ్లు, మజ్జిగ, గ్యాలరీలు, ఎల్ఈడి స్క్రీన్లు అమర్చారు.