చంద్రబాబు అసంతృప్తితో ఉన్న కొలికపూడి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasarao)వ్యవహారం వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతోషంగా లేరని తేలిపోయింది. శనివారం విజయవాడ పార్లమెంట్ పరిధిలో ముప్పాళ్ల గ్రామానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడికి వచ్చిన కొలికపూడితో చంద్రబాబు మాట్లాడలేదు. కొలికపూడి చేయి కలపాలని చూసినా, చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రజావేదిక వద్దకు కొలికపూడి రాలేదు. దీంతో చంద్రబాబు ఆయన మీద చాలా కోపంగా ఉన్నారని అందరికీ క్లియర్ అయిపోయింది.
టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు దూరం
అమరావతి ఉద్యమంలో పని చేసినందుకు చంద్రబాబు కొలికపూడిని పిలిచి టిక్కెట్ ఇచ్చారు. ఆయన సొంత ఊరు కాకపోయినా, తిరువూరు నుంచి చివరి నిమిషంలో అభ్యర్థిగా నిలబెట్టారు. గెలవడానికి అవసరమైన సాయం అంతా చేశారు. పార్టీ నేతలు కొందరు అసంతృప్తి చూపినా, వాళ్లని సర్దిచెప్పారు. కొలికపూడి అదృష్టమో, లేక టీడీపీ కార్యకర్తల కష్టమో, ఆయన ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తన పార్టీకే తలనొప్పిగా మారింది. రమేష్ రెడ్డి అనే నేతపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని అల్టిమేటం ఇచ్చాడు. దీంతో ఆయన పార్టీ నుంచి పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తోంది.
పది నెలల్లోనే ఆరోపణలు, అసంతృప్తి
తిరువూరులో ఎమ్మెల్యేగా గెలిచి పది నెలలు కాకముందే కొలికపూడి పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నేతలతో కలిసి తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తిరువూరు టీడీపీ కార్యకర్తలు ఆయన వద్దని చెప్పుకుంటున్నారు. వేరే ఇంచార్జ్ ను పెట్టాలని కోరుతున్నారు. ఒకప్పుడు టీడీపీలో పేరు తెచ్చుకున్న కొలికపూడి, ఇప్పుడు స్వార్థం కోసం తప్పుడు రాజకీయాలు చేసి, తన పరపతిని కోల్పోయారని పార్టీ నేతలే జాలిగా మాట్లాడుకుంటున్నారు.