Ratan Tata : వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వ్యాపార రంగంలో ఎన్నో నూతన ఒరవడులతో పాటు నిస్వార్థంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన రతన్ టాటా ఇక లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున టాటా మరణం పై స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే రతన్ టాటా(Ratan Tata) మరణ వార్త తెలియగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సైతం ఈయన మరణ వార్తలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రతన్ టాటా మరణం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. భారతీయులకు ఇది ఎంతో బాధాకరమైన రోజు. సామాజిక సేవలో రతన్ టాటాను మించినవారు లేరు. మనదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో రతన్ జీ ఒకరు. ఆయనే నిజమైన పారిశ్రామికవేత్త, నేడు మనం ఒక గొప్ప వ్యక్తిని మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయాము. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు భావి తరాలకు స్ఫూర్తినిస్తాయి.. మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు.
Also Read : Ratan Tata Success : అసలు రతన్ టాటా ఎవరు? వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారు?…..
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా టాటా మరణ వార్తపై స్పందించారు. టాటా గారిది బంగారం లాంటి మనసు. మన దేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఆయన దూర దృష్టితో ఎంతోమంది జీవితాలను మార్చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రాజమౌళి కూడా ఈయన మరణ వార్త స్పందిస్తూ ఇది అసలు ఊహించలేదని ఆయన ఒక లెజెండ్ అంటూ కొనియాడారు. ఆయన భౌతికంగా మరణించిన మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతారని టాటా ఉత్పత్తులు లేని రోజును ఊహించుకోవడం ఎంతో కష్టతరం అంటూ జక్కన్న ఈయన మరణం పై స్పందించారు. వీరితోపాటు రానా కుష్బూ వంటి తదితరులు సోషల్ మీడియా వేదికగా టాటా మరణం పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.