Ratan Naval Tata : దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడంతో సోమవారం నుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
ఈ మేరకు రతన్ టాటా అస్తమించినట్లు టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తనకు మెంటర్, గైడ్ తోపాటు మంచి స్నేహితుడన్నారు. పని పట్ల ఆయన నిబద్ధత, నిజాయితీ, ఆవిష్కరణలతో అంతర్జాతీయంగా ముద్ర వేశారన్నారు. సమాజ సేవ పట్ల టాటా అంకితభావం లక్షలమందికి మేలు చేసిందని తెలిపారు. టాటా ఫ్యామిలీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read : Samantha: సమంత పై మంత్రికి సంచలన వ్యాఖ్యలు.. ఏకమైన టాలీవుడ్!
Ratan Naval Tata: The Iconic Business Tycoon Passes Away
రతన్ టాటా(Ratan Tata) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారంటూ ప్రధాని మోదీ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. “రతన్ టాటా దూరదృష్టి ఉన్న పారిశ్రామిక వేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు” అని మోదీ పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
రతన్ టాటా 1991లో ‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వందేళ్ల కిందట తన ముత్తాత స్థాపించినటువంటి గ్రూప్‌ను 2012 వరకు ఎంతో సక్సస్ ఫుల్ గా నడిపారు రతన్ టాటా. 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలిసర్వీసెస్‌ను, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రారంభించి.. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు. టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో రతన్ టాటా కీ రోల్ ప్లే చేశారు. రతన్ టాటా నాయకత్వంలో, టాటా గ్రూప్స్ సంస్థ.. 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.
తన వ్యాపారాలన్నింటినీ ఎంతో విజయవంతంగా నడిపిస్తూ.. దేశంలోని గొప్ప పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా రతన్ టాటా(Ratan Tata) పేరు సంపాదించుకున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటా అంతకు మించిన ఎంతో గొప్ప మానవతావాది కూడా. రతన్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాల్లో దాదాపుగా 60 నుంచి 65 శాతం వరకు దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందించారు. 86 సంవత్సరాలు గల రతన్ టాటా.. చివరి దశలో గౌరవ ఛైర్మన్ హోదాలో కొనసాగారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ.. టాటా సన్స్‌కు కూడా గతంలో ఛైర్మన్‌గా ఉన్నారు రతన్ టాటా.
టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్టులకి మాత్రం రతన్ టాటా నాయకత్వం వహించడం జరిగింది. ఇక బిజినెస్ టైకూన్‌గా పేరు తెచ్చుకున్న రతన్ టాటాను.. 2008వ సంవత్సరంలో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్‌తో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అంతకు ముందు.. 2000వ సంవత్సరంలోనే రతన్ టాటాను పద్మ భూషణ్ వరించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఒహియో స్టేట్ యూనివర్శిటీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ ఐఐటి ఖరగ్‌పూర్‌తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా రతన్ టాటా అందుకున్నారు.