Tata Punch : గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎస్ యూవీ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. 2024 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారతదేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో ఎస్యూవీ సెగ్మెంట్ కార్లు మాత్రమే 52శాతం వాటను కలిగి ఉన్నాయంటే కస్టమర్లకు వాటిపై ఆసక్తి ఎంత ఉందో దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ సేల్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన బెస్ట్ సెల్లింగ్ కారు పంచ్‌లో అప్డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ సమయంలో భారతీయ రోడ్లపై చాలా సార్లు కనిపించింది. టెస్ట్ సమయంలో లీక్ అయిన స్పై షాట్లు రాబోయే ఎస్ యూవీ అనేక వీచర్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో అంటే 2025లో కంపెనీ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ సాధ్యమయ్యే మార్పులు, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
న్యూస్ వెబ్సైట్ రష్లేన్లో1 ప్రచురించిన ఒక వార్త ప్రకారం.. రాబోయే టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. టెయిల్ ల్యాంప్‌లో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. కాంపాక్ట్ ఎస్ యూవీ విభాగంలో మరిన్ని ప్రీమియం ఫీచర్ల కోసం కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి ఫేస్‌లిఫ్ట్ కొన్ని వేరియంట్లకు సన్‌రూఫ్‌ను కూడా అందించనున్నట్లు లీక్ అయిన అప్డేట్లు నిర్ధారిస్తాయి. ఈ ఫీచర్ కొత్త అడ్వెంచర్ ఎస్, అడ్వెంచర్ + ఎస్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం గురించి మాట్లాడినట్లయితే.. అది 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లతో అందించబడుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించవచ్చని చాలా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. భారతీయ మార్కెట్లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షలుగా అంచనా.
పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే.. దానిలో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇవ్వబడుతుంది. ఇది గరిష్టంగా 86బీహెచ్ పీ శక్తిని, 113ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లో హ్యుందాయ్ ఎక్సెటర్, సిట్రోయెన్ సీ3, నిస్సాన్ మాగ్నైట్లకు పోటీగా నిలబడుతుందని అంటున్నారు.