నందమూరి నటసింహం బాలకృష్ణ.. 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు నేడు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోలందరూ హాజరుకానున్నారు. మరోవైపు నందమూరి అభిమానులు, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఐదారేళ్లుగా ఎదురు చూస్తున్నారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు.
హనుమాన్ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో బాలయ్య ప్రధాన పాత్రలో కనిపించనున్నాడనే వార్త నందమూరి అభిమానులకు పండగే అనే చెప్పాలి. మైథలాజికల్ టచ్.. సోషియోఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. సెప్టెంబర్ 6న మోక్ష బర్త్ డే కానుకగా ఈ సినిమాను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీలో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తారనే లీక్ ఉంది కానీ నిర్ధారణగా తెలియాలంటే పూజా రోజు దాకా వెయిట్ చేయాలి. ఇక మోక్షజ్ఞ విషయంలో తాను అనుసరించబోయే ప్రణాళిక గురించి నట స్వర్ణోత్సవ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో బాలయ్య వివరించారు.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోక్షజ్ఞ న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, వైజాగ్ సత్యానంద్‌తో కలిసి డ్యాన్స్, ఫైట్లలో మెళకువలు నేర్చుకున్నారు. బాలయ్య తన కుమారుడికి మూడు సలహాలు ఇచ్చాడు. నందమూరి ఫ్యామిలీకి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని, చిన్నల్లుడు విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ పేరు కూడా లైన్లో ఉంది. ఏది ఏమైనా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలతో త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.