Chandrababu: అధికారం చేపట్టి 100 రోజులు.. మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ – ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ – ఎవరెక్కడో తేల్చేయబోతున్న సీఎం చంద్రబాబు……

2 Min Read

Chandrababu: అధికారం చేపట్టి 100 రోజులు.. మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ – ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ – ఎవరెక్కడో తేల్చేయబోతున్న సీఎం చంద్రబాబు……ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ నెల 20కి వంద రోజులు పూర్తి చేసుకోనుంది. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి 164 సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టాయి. దీంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం పాలన కొనసాగించింది. పాలన ప్రారంభించినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలను అధిగమించింది. మొత్తంగా ఈ నెల 20కి 100 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతోంది. దీంతో కూటమి పాలనపై ప్రోగెస్ రిపోర్టు తెలుసుకునేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారు. 

ఈ మేరకు 100 రోజుల పాలనపై, మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 20వతేదీ నుంచి 26 తేదీ వరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. ప్రజల వద్దకే వెళ్లి తమ పాలనపై అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కూటమి ఎమ్మెల్యేలతో బుధవారం సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగనున్న ఈ సమావేశానికి అందరూ రావాలని ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టిన కార్యక్రమాలు, లోటు పాట్లపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. 

ఇక ఇదే క్రమంలో రాష్టంలో ఈ 100 రోజుల్లో మంత్రుల పని తీరు ఎలా ఉంది, శాఖలపై వారు పట్టు పెంచుకున్నారా? లేదా? సకాలంలో శాఖాపరమైన సమీక్షలు నిర్వహిస్తున్నారా? లేదా? ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఎవరెక్కడ ఉన్నారనే అంశంపైన సీఎం నారా చంద్రబాబు నాయుడు తాజా రిపోర్ట్ తెప్పించుకున్నారు. దాన్ని రేపు కేబినెట్ భేటీలోనే వారికి అందజేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇందులో నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలుపై చర్చించనున్నారు. మద్యం పాలసీపైన ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం తమ యొక్క ప్రతిపాదనలను సమర్పిస్తుంది.

అలాగే ఇటీవల వరదలు, నష్టంపైన, కేంద్రం ఇచ్చే సాయం పైన మంత్రులు చర్చిస్తారు. అటు వివిధ మంత్రిత్వ శాఖల నివేదికలపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. కేబినెట్ భేటీలోనే వరద బాధితులకి సాయంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేసే అవకాశముంది. కేబినెట్ అజెండాపై చర్చ తరువాత 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్‌ని సీఎం చంద్రబాబు వారికి అందించనున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఇస్తారు. అనంతరం దీనిపై చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. మంత్రులు తమ పని తీరు మెరుగుపర్చుకునే దిశగా చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కేబినెట్ భేటీల్లో మంత్రులు అలాగే ఎమ్మెల్యేలకి చంద్రబాబు హెచ్చరికలు చేశారు.

Share This Article